Mobile Popup Ad
Mobile Popup Ad

యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఖబర్దార్: సీపీఐ(ఎం.ఎల్)

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమి బదలాయింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ కళాశాలకు ఇతర ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) PDSU, TUCI, POW, PYL సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్, పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే .సంధ్యారాణి, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు డి.నవీన్ లు మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు, ప్రజలకు ఎంతో దోహదపడ్డారన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడంతో చాలా సంతోషకరమని చెప్పారు. అయితే ఈ వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయించి, బదలాయింపులు చేయడం అన్యాయం అని ధ్వజమెత్తారు.

ఆదర్శ వ్యవసాయ పద్ధతులలో నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు దేశంలోనే ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, సంప్రదాయ పంటలే కాకుండా వాణిజ్య పంటలు ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ కళాశాలతో మరిన్ని పరిశోధనలు, సౌకర్యాలు జిల్లా రైతాంగానికే కాకుండా చుట్టుపక్కల జిల్లాల రైతాంగానికి ఉపయోగపడతాయన్నారు. కానీ ఈ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీలో నెలకొల్పడం అంటే రెండింటి వెనుకబాటుకు ప్రభుత్వమే కుట్రలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికీ ఇంకా సమర్థవంతమైన భవన సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించబడలేదన్నారు. యూనివర్సిటీ అనుబంధంగా మరిన్ని కొత్త కోర్సులు రావలసిన అవసరం ఉన్నదన్నారు. అందుకు ఇంకా భవనాలు నిర్మాణం కావలసి ఉంటుందన్నారు. ఇప్పటికే ఇక్కడ నీటి సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని, యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందుకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలన్నారు.

వ్యవసాయ కళాశాల తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ కాదని, వ్యవసాయ కళాశాల పరిధి పెరిగే అవకాశం ఉన్నదన్నారు. భవిష్యత్తులో ప్రయోగాత్మక పంటలు పండించడం, పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు సమర్థంగా నీటి సదుపాయం, భూమి సదుపాయం, ఇతర వనరుల సదుపాయం అవసరమన్నారు. ఇవేవీ తెలంగాణ యూనివర్సిటీలో సమృద్ధిగా లేవన్నారు. రెండు విభిన్నమైన యూనివర్సిటీలను ఒకే ప్రాంగణంలో నిర్వహించడం రెండింటి అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ కళాశాలకు జాతీయ రహదారికి ఆనుకుని, జక్రాన్ పల్లి మండల పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, కేంద్రీయ విద్యాలయం, విమానాశ్రయం ఏర్పాటు, వ్యవసాయ కళాశాలలతో ఈ ప్రాంతమంతా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ హబ్ గా మారే అవకాశం పుష్కలంగా ఉందన్నారు. ఇది నిజామాబాద్ జిల్లాకే కాకుండా అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు కూడా ఉపయోగంగా ఉంటుందన్నారు.

కావున తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) భూములను వ్యవసాయ కళాశాలకు బదలాయింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ కళాశాలకు యూనివర్సిటీ భూములు కాకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పున: పరిశీలన చేయకపోతే జిల్లా ప్రజలను, రైతులను, విద్యార్థులను ఐక్యం చేసి ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్, ఉపాధ్యక్షులు ఎం వెంకన్న డి. రాజేశ్వర్, నిర్మల్ జిల్లా బాధ్యులు కే.రాజన్న, భూమేశ్వర్, కామారెడ్డి బాధ్యులు ఎంముత్తన్న, సత్యక్క, కరీంనగర్ జిల్లా బాధ్యులు రాంప్రసాద్ సిద్దిపేట జిల్లా బాధ్యులు శ్రీశైలం, విఠల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీఓడబ్ల్యు నాయకురాలు అమూల్య, పిడిఎస్.యు నాయకులు సృజన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Read Also:  తమిళనాడులో బీజేపీకి భారీ షాక్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>