కలం, భువనగిరి బ్యూరో: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోషించిన పాత్ర మరువలేనిదని ఆయన కొనియాడారు. కేరళ ఎన్నికల ఫలితాల అనంతరం చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టార్ క్యాంపెయినర్‌గా తనదైన ముద్ర వేశారని చామల పేర్కొన్నారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేరళ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి వారిని ఆకట్టుకున్నారని తెలిపారు. కేరళలో మరే ఇతర నేత చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. ప్రచార పర్వంలో కేరళ సీఎం పినరయి విజయన్, ప్రధాని మోడీ ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని ఎంపీ వివరించారు.
“పినరయి విజయన్ ‘నీ పో మోనే’ (నువ్వు వెళ్ళు బాబూ) అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించగా, దానికి సీఎం రేవంత్ రెడ్డి అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. విజయన్ టర్మ్ ముగిసిందని, ఆయన ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని రేవంత్ చెప్పిన మాటలను కేరళ ప్రజలు ఓట్ల రూపంలో నిజం చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా, కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి విడుదల చేయడం ఆయన ప్రాధాన్యతకు నిదర్శనమని చామల అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించిన తీరును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ ప్రజలు మోడీ, విజయన్ బంధాన్ని తిరస్కరించి, కాంగ్రెస్ సిద్ధాంతాలకు పట్టం కట్టారని, ఈ విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) పేర్కొన్నారు.
Read Also: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: మోదీ
Follow Us On: Sharechat

