కలం, నిర్మల్: జిల్లాలోని (Nirmal) సోన్ మండలం కడ్తాల్ అంగన్‌వాడీ కేంద్రానికి జరిగిన బదిలీని వెంటనే నిలిపివేసి, ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ–2 టీచర్ పోస్టును భర్తీ చేయాలని గ్రామస్తుల కోరారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం రాము మాట్లాడుతూ.. కడ్తాల్ గ్రామంలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిలో అంగన్‌వాడీ-2 కేంద్రంలో పనిచేసిన టీచర్ పదవీ విరమణ చేయడంతో ఆరేండ్లుగా ఆ పోస్టు ఖాళీగా ఉందన్నారు. అప్పటి నుంచి అంగన్‌వాడీ-1 కేంద్రంలోని టీచర్‌ను డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించేలా నియమించారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియలో ఉందని గుర్తుచేశారు. దిలావర్‌పూర్ మండలం కాల్వ కేంద్రంలో పనిచేస్తున్న ఏలేటి సరితను కడ్తాల్ అంగన్‌వాడీ-1 కేంద్రానికి బదిలీ చేశారన్నారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే సమయంలోనే, ఇలాంటి బదిలీలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీంతో అర్హులైన స్థానిక మహిళలకు ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నోటిఫికేషన్ సమయంలో బదిలీకి విల్లింగ్ ఇచ్చిన సంబంధిత జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, సీడీపీఓలపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

