భద్రాద్రి జిల్లాలో సీపీఐ నిరసనలు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా వ్యాప్తంగా సీపీఐ (CPI) శ్రేణులు, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొత్తగూడెంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కే సాబిర్ పాషా నాయకత్వంలో నిరసన చేపట్టగా, మణుగూరులో సీపీఐ రాష్ట్ర నాయకులు పుల్లారెడ్డి నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. పార్టీ శ్రేణులతో పాటు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మానవహారం చేపట్టి ఖాళీ సిలిండర్లతో నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లది యుద్ధోన్మాదమని, ఈ చర్యలు ప్రపంచ శాంతిని తీవ్రంగా విచ్ఛిన్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మానవహారం చేపట్టి ఖాళీ సీలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా.. కేంద్రం మౌనం వహించడం శోచనీయమని, అమెరికా ఒత్తిళ్లకు లొంగి కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని మండిపడ్డారు. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు నావికా విన్యాసాలకు వచ్చి వెళుతున్న ఇరాన్ నౌకను దేశ సముద్ర తీరంలో అమెరికా కూల్చివేస్తే కేంద్ర ప్రభుత్వం కనీసం ఖండించకపోవడం సిగ్గుచేటని, 160 మంది పిల్లలను బలి తీసుకున్నప్పుడు అమెరికా ఒత్తిడితో మాట్లాడకుండా మోకరిల్లడం దేశ సార్వభౌమాధికారానికి భంగకరమని విమర్శించారు.

దేశ ప్రయోజనాలను అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో సామాన్యుడిపై ధరల భారం పెరుగుతోందని, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల వంటింటిపై మోయలేని భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ రావు, కంచర్ల జమలయ్య, వాసి రెడ్డి మురళీ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఐపీఎల్ 2026కి చిన్నస్వామి స్టేడియం రెడీ!

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>