epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి సజ్జనార్

హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) ఇటీవల సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. శాంతి భద్రతల విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రకటించారు. బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఐబొమ్మ రవిని పట్టుకోవడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికే ఎక్కువ మద్దతు దక్కుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల అర్ధరాత్రి నిర్వహించిన పెట్రోలింగ్ లో నేరుగా సజ్జనార్ పాల్గొన్నారు. రాత్రి సమయాల్లో తెరిచిఉన్న దుకాణాలను స్వయంగా మూసేయించారు. కొందరు రౌడీ షీటర్ల ఇండ్లకు ఆకస్మికంగా వెళ్లి వాళ్ల జీవనశైలిని పరిశీలించారు. నేర ప్రవృత్తిని మానుకోవాలని సూచించారు. ఆదివారం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా తిరిగి పర్యవేక్షించారు.

రౌడీషీటర్ల ఇళ్లకు సీపీ స్వయంగా వెళ్లి తనిఖీలు

సీపీ సజ్జనార్(CP Sajjanar) తన బృందంతో కలిసి రౌడీషీటర్ల ఇండ్లకు వెళ్లి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఆదాయ వనరులు, రాత్రి వేళల్లో ఎక్కడ ఉన్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? అనే అంశాలపై లోతైన ఆరా తీశారు. “మీ నేర ప్రవృత్తిని పూర్తిగా మానుకోండి. మంచి జీవితం గడపండి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

చాలా మంది రౌడీషీటర్లు(Rowdy Sheeters) తమ ఇంటికి నేరుగా సజ్జనార్ రావడంతో ఒకింత షాక్‌కు గురైనట్టు సమాచారం. సీపీ స్థాయి అధికారి స్వయంగా క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. రాత్రి 12 గంటల తర్వాత కూడా తెరిచి ఉన్న పాన్ షాపులు, టీ షాపులు, కిరాణా దుకాణాలు, హోటల్స్ నిర్వాహకులను సీపీ సజ్జనార్ స్వయంగా పిలిచి మాట్లాడారు. “రాత్రి వేళల్లో దుకాణాలు తెరిచి ఉండటం వల్ల రౌడీ మూకలు సమావేశమై నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. అనుమతి ఉన్న సమయం తర్వాత దుకాణాలు తెరవడం నిషేధం. మళ్లీ ఇలా కనిపిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం” అని కఠిన హెచ్చరిక జారీ చేశారు.

పోలీసు గస్తీ వ్యవస్థపై సమగ్ర పరిశీలన

పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తత, గస్తీ వాహనాల సమయపాలన, స్పందన బృందం (బ్లూ కోల్ట్స్) రియాక్షన్ టైమ్, పోలీసు పికెట్లు, చెక్ పోస్టుల వద్ద అధికారుల సమయపాలన, అన్నింటిపై సీపీ సజ్జనార్ స్వయంగా తనిఖీ చేశారు. ఎక్కడా నిర్లక్ష్యం కనిపించకుండా చూసుకున్నారు. అక్కడి సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. “హైదరాబాద్ నగర భద్రత మా అత్యంత ప్రాధాన్య అంశం. రౌడీషీటర్లు, నేరస్తులు ఎవరూ రాత్రి వేళల్లో స్వైరవిహారం చేయడానికి వీల్లేదు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, పెట్రోలింగ్‌లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. ప్రజలు ఎప్పుడూ భయపడకుండా సురక్షితంగా జీవించేలా పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.

Read Also: ఎన్డీయేకు కూటమిలోకి ఎంఐఎం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>