కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్పొరేషన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం కరీంనగర్ టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు సమర్పించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ నెల 4న కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పిఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిని నేరస్థులతో పోల్చడం, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌లు 356, 353 కింద నేరంగా పరిగణించవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ప్రజలలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై అపనమ్మకం కలిగించే ప్రయత్నమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వారు అన్నారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని, అలాగే ఆయనకు చంచల్‌గూడ జైలులోని నేరస్థులతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి తాజుద్దీన్, భాస్కర్ నాయక్, పడిశెట్టి భూమయ్య, మహమ్మద్ ఇమ్రాన్, కంకణాల అనిల్, షుకూర్, ఆసీఫ్, ఇమ్రాన్ ఘని, అబ్దుల్ రెహమాన్, జక్కుల మల్లేశం, కుంభాల రాజకుమార్, సుదర్శన్ రెడ్డి, నిహాల్ అహ్మద్, శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
Follow Us On : WhatsApp

