కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తరఫున కోర్టుకు అమికస్ క్యూరీగా ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను నియమిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ప్రకటించింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘కేజ్రీవాల్ (Arvind Kejriwal), సిసోడియా, దుర్గేష్ పాఠక్ తరఫున వాదనలు వినిపించడానికి ముగ్గురు సీనియర్ న్యాయవాదులను అమికస్ క్యూరీగా నియమిస్తాం. దీనిపై శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
మద్యం పాలసీ కేసు (Delhi Liquor Scam)లో నిర్దోషులుగా విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కేజ్రీవాల్, సిసోడియా బహిష్కరించారు. జడ్జి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని వారు కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. దీంతో తాము వ్యక్తిగతంగా గానీ, న్యాయవాదుల ద్వారా గానీ విచారణకు హాజరుకాబోమని వారు స్పష్టం చేశారు. నిందితులెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో జస్టిస్ శర్మ.. వారి తరఫున వాదనలు వినడం న్యాయ ప్రక్రియలో భాగమని భావించి అమికస్ క్యూరీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp

