కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత (Cold Wave) భారీగా పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి క్రమంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియల్ నమోదు అయింది. గత పదేళ్లలో ఇదే అతితక్కువ ఉష్ణోగ్రత అని చెబుతున్నారు అధికారులు. అటు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 4.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని.. జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో..
రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత (Cold Wave) పెరుగుతోంది. శనివారం శేరిలింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అటు మల్కాజిగిరిలో 8.3, రాజేంద్రనగర్ లో 9.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. రాబోయే రోజులు నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరం ఉంటే తప్ప రాత్రి పూట బయటకు రావొద్దని హెచ్చరించారు అధికారులు.
ఏపీలో..
ఏపీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో 5 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, మారేడు మిల్లి ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. కాకినాడ, శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీ సత్యసాయి, ఏలూరు, నంద్యాల లాంటి ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Also: ఫైబర్ పుష్కలంగా ఉండే ఎనిమిది ఫ్రూట్స్
Follow Us On: Instagram


