కలం, వెబ్ డెస్క్: శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) పర్వదినం కన్నులపండువగా మొదలైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభం కావడంతో భక్తులు పులకించిపోతున్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసులు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రేవంత్ రెడ్డిని పూలమాలతో స్వాగతించారు.
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సాధారణ భక్తులకు కేటాయించారు. మొదటి మూడు రోజులకు ఆన్‌లైన్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, క్యూ లైన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏర్పాట్లు చేశారు.
Read Also: జాయింట్ చెక్ పవర్‌తో చిక్కులెన్నో..
Follow Us On: Pinterest


