కలం డెస్క్ : కొత్త సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీలు కొలువుదీరాయి. పాత పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే అభివృద్ధి పనులపై సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వం చెక్ పవర్ (Sarpanch Cheque Power) కల్పించింది. వారిద్దరూ సంతకం చేస్తేనే ట్రెజరీ నుంచి బిల్లులకు సంబంధించిన డబ్బులు రిలీజ్ కానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో రూపొందించిన చట్టం ద్వారా ఈ నిబంధన వచ్చినప్పుడే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుండడంతో జవాబుదారీతనం ఎలా?.. పారదర్శకత ఉంటుందా?.. అవకతవకలను అరికట్టడం ఎలా?.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చెక్ చేసే మెకానిజం ఏది?.. ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై ప్రభుత్వ అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలే ఉన్నాయి.
ప్రభుత్వ ప్రమేయం లేకుంటే ఎలా? :
గ్రామాభివృద్ధి పనులు జరిగిన తర్వాత బిల్లుల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయమే లేకుండా ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న సర్పంచ్, ఉపసర్పంచ్‌లిద్దరికే చెక్ పవర్ (Sarpanch Cheque Power) ఇవ్వడంపై గత ప్రభుత్వంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో పంచాయతీ రాజ్ చట్టంలో వీరిద్దరికే చెక్ పవర్ ఇచ్చేలా చట్టం రూపొందిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరే చెక్కులపై సంతకం చేయడం ద్వారా ప్రభుత్వం తరఫున పంచాయతీ కార్యదర్శి లాంటి అధికారుల ప్రమేయమే లేకుండా పోయిందని అప్పట్లోనే కొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో బిల్లుల చెల్లింపులో ఇద్దరూ కుమ్మక్కై ఖజానాకు గండి కొట్టారంటూ కలెక్టర్ల వరకూ రాతపూర్వకంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్ళాయి.
ఇది మంచి సంప్రదాయం కాదు : సర్పంచ్‌ల ఐక్యవేదిక:
సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం మంచి సంప్రదాయం కాదని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం లేదని తెలంగాణ సర్పంచ్‌ల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పుడే నిరసనలు తెలిపామని గుర్తుచేశారు. చెక్ పవర్ ఒక ప్రజా ప్రతినిధికి, ఒక ప్రభుత్వ అధికారికి ఉండడం ద్వారానే అవకతవకలను నియంత్రించవచ్చని, జవాబుదారీతనం ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చెక్ పవర్ కమిషనర్‌కే ఉంటుందని, జిల్లా పరిషత్ స్థాయిలో జెడ్పీ సీఈఓకు ఉంటుందని గుర్తుచేశారు. చాలా సందర్భాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కుమ్మక్కై ఎక్కువ మొత్తంలో బిల్లులు డ్రా చేసుకున్న ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌కు వార్డు సభ్యులు ఎన్నుకున్న ఉపసర్పంచ్‌కు ఒకే రకమైన అధికారాలా అంటూ వారి మధ్య విభేదాలు కూడా వచ్చాయన్నారు.
ఎంపీటీసీ ఎన్నికల తర్వాత మార్పు? :
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే కాక ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జవాబుదారీతనాన్ని పెంచడం గురించీ ఆలోచిస్తున్నది. జాయింట్ చెక్ పవర్ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలని పలువురు నిపుణులు, అధికారుల నుంచి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అయితే ఇప్పుడు మార్పులు చేయాలంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందన్న భావనతో పాత విధానాన్నే ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత అవసరమైతే ఈ విధానాన్ని ప్రభుత్వం సమీక్షించే అవకాశాలున్నాయి. చట్ట సవరణ జరిగే అవకాశమూ లేకపోలేదు. ప్రజాప్రతినిధులు ఐదేండ్లు మాత్రమే ఉంటారని, కానీ అధికారులు రిటైర్‌మెంట్ వరకూ ఉంటారు కాబట్టి నిధుల విడుదలలో ఆచితూచి అడుగేస్తారనే అభిప్రాయముంది. దీంతో కొంతమేరకైనా అవకతవకలను నివారించవచ్చన్న వాదన తెరపైకి వస్తున్నది.
Read Also: యమపాశంలా చైనా మాంజా.. ఎన్ని మెడలు తెగాయో తెలుసా?
Follow Us On: X(Twitter)


