కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, తిరుమల తరహాలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం ఎన్‌హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట సమగ్ర అభివృద్ధికి సంబంధించి సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం స్థలాలు, భూముల కేటాయింపుల విషయంలో టీటీడీ అనుసరిస్తున్న పారదర్శక విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
టెంపుల్ బోర్డు వద్దే హక్కులు
ఏ ప్రాతిపదికన ఏ సంస్థకు స్థలాలు ఇచ్చినా.. సదరు భూమి పూర్తి యాజమాన్యపు హక్కులు మాత్రం టెంపుల్ బోర్డు వద్దే ఉండాలని అధికారులకు సీఎం (CM Revanth Reddy) తేల్చిచెప్పారు. యాదగిరిగుట్టలో వివిధ ఆధ్యాత్మిక మఠాలకు, కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపై స్పష్టమైన నిబంధనలు, పారదర్శకమైన విధివిధానాలతో కూడిన ప్రత్యేక పాలసీని రూపొందించాలని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట గుట్టపైన భక్తుల వసతి కోసం గెస్ట్ హౌస్‌ల నిర్మాణంలో తిరుమల మోడల్‌ను అనుసరించాలని సీఎం సూచించారు. గుట్టపైన కాటేజీలు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన దాతలు, సంస్థల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించి విడతల వారీగా అనుమతులు మంజూరు చేయాలని నిశ్చయించారు. ఆలయ పరిధిలో అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
వారం రోజుల్లో ఇంజినీర్ల కమిటీ నివేదిక
యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇదివరకు ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. వారం రోజుల్లోగా పూర్తి నివేదికను తనకు సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో యాదగిరిగుట్ట టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే దిశగా తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కీలక వైటీడీఏ సమీక్షా సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. అధికార యంత్రాంగం తరపున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ పాల్గొన్నారు.

