కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలోని ఖాళీమాత ఆలయంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. దేవుడు కొలువుండే గర్భగుడిలోనే ఒక మైనర్ బాలికపై ఆలయ అటెండర్ దారుణానికి ఒడిగట్టాడు.
పవిత్రమైన ఆలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడు, ఒక మైనర్ బాలికను లొంగదీసుకుని ఆలయ గర్భగుడిలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి వేళలో ఆలయ గర్భగుడిలో లైట్లు వెలుగుతుండటం, లోపలి నుంచి అనుమానాస్పద శబ్దాలు రావడం గమనించిన స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు గుడి వద్దకు వెళ్లి చూడగా ఈ దిగ్భ్రాంతికర విషయం బయటపడింది.
కామాంధుడి చేష్టలను గమనించిన స్థానికులు నిందితుడు సాయన్నను అక్కడికక్కడే పట్టుకున్నారు. అనంతరం వెంటనే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘాతుకం జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

