కలం, ఖమ్మం బ్యూరో : సాగునీటి ప్రాజెక్టుల పురోగతి నుంచి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం వరకు, పవిత్ర భద్రాచల దివ్యక్షేత్ర సమగ్ర విస్తరణ నుంచి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమాలే మొదటి ప్రాధాన్యంగా పాలన సాగుతోందని కొనియాడారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు రెండింటిలోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా జిల్లా యంత్రాంగం, అధికారులు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడి సాగునీటి కోసం రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో సీతారామ ప్రాజెక్ట్ కొండంత భరోసాగా నిలిచిందన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని 1.25 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను దిగ్విజయంగా అందించామని వెల్లడించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ అనుమతులు లభించగానే ఆ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గోదావరి వరదల ముప్పు నుంచి భద్రాచలం పట్టణాన్ని శాశ్వతంగా కాపాడేందుకు కరకట్ట విస్తరణ పనులను వేగవంతం చేసినట్లు మంత్రి తెలిపారు. గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో రామాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం సులభతరమైందన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని రూ. 586 కోట్లతో అభివృద్ధి, విస్తరణ చేసే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ విస్తరణ పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు తెలంగాణ రాష్ట్రానికే “ఆయిల్ ఫామ్ హబ్” గా ఆవిర్భవించిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి సిరుల తల్లి అయిన సింగరేణి సంస్థ విస్తరణ, భవిష్యత్ మనుగడ కోసమై కొత్త కోల్ బ్లాక్‌లను కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందన్నారు. ఇక విద్యా రంగంలో కొత్తగూడెం ఖ్యాతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ని స్థాపించడం జరిగిందని, ఇది జిల్లా యువత భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

