ఏషియన్ గేమ్స్ ఎంపికపై బోపన్న గుర్రు!

కలం, స్పోర్ట్స్ : 2026 ఏషియన్ గేమ్స్ (Asian Games 2026) కోసం భారత టెన్నిస్ జట్టు ఎంపిక విధానంలో మార్పులపై రెండుసార్లు పసిడి పతకం సాధించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించిన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఖండ స్థాయిలో టాప్-8లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. దీంతో ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించిన ఐదుగురు భారత టెన్నిస్ క్రీడాకారులు అవకాశం కోల్పోయారు. మానస్ ధామ్నే, వైష్ణవి అడ్కర్, సహజ యమలపల్లి, వైదేహి చౌదరి, ప్రార్థన తోంబారే ఈ జాబితాలో ఉన్నారు.

ర్యాంకింగ్స్‌కు విలువ లేదా?

ఈ నిర్ణయంపై బోపన్న సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆటగాళ్లు ఎలాంటి అడ్డదారులు తొక్కకుండా అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి ర్యాంకింగ్స్ సాధించారని పేర్కొన్నారు. అలాంటి ఆటగాళ్లను కనీసం మైదానంలోకి దిగకుండానే అధికారుల కమిటీ నిర్ణయించడం సరికాదని ప్రశ్నించారు. కేవలం అధికారులు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే అర్హతలు, ర్యాంకింగ్స్‌కు విలువ ఏముంటుందని బోపన్న నిలదీశారు. ఈ వ్యవహారం కేవలం ఐదుగురు ఆటగాళ్లకు సంబంధించిన సమస్య కాదని, వారి వెనుక ఉన్న తల్లిదండ్రులు, స్పాన్సర్లు చేసిన కృషి, పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఆటగాళ్ల ప్రతిభను మైదానంలోనే తేల్చాలి

పతకాలు సాధించే అవకాశం లేదనే కారణంతో ఆటగాళ్లను పక్కన పెట్టడం వల్ల వారిపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులు, స్పాన్సర్ల విశ్వాసం దెబ్బతింటుందని బోపన్న ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాలు బోర్డు రూమ్‌లలో కాకుండా ఆటగాళ్ల ప్రతిభను మైదానంలోనే తేల్చాలని సూచించారు. 2026 ఏషియన్ గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ జట్టు ఎంపిక విధానంపై బోపన్న చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>