కలం, ఖమ్మం బ్యూరో: రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో రవాణా కమిషనర్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిపిన చర్చలు ఫలించడంతో ఏఐటీయూసీ, జేఏసీల ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో ఆటో కార్మికులు (Auto Workers) భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కార్యాలయమైన శేషగిరిభవన్ నుంచి ప్రారంభమై బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, ఎంజీ రోడ్డు మీదుగా తిరిగి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది.
అనంతరం అక్కడ నిర్వహించిన సభలో కంచర్ల జమలయ్య మాట్లాడుతూ.. సమ్మె నోటీసులోని 13 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రాష్ట్రవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి ఆటో కార్మికుడికి ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని చెప్పారు. అలాగే ఆర్టీసీకి ఈవీ (ఎలక్ట్రిక్) ఆటోలను కేటాయించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుందని స్పష్టం చేశారు.
రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రత, భరోసా కల్పించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన గడువులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె పోరాటం తప్పదని, హక్కుల సాధన పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయోత్సవ ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు ధర్మపురి నరేష్, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

