ఆదిలాబాద్‌లో సీఎం ప‌ర్య‌ట‌న‌.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ముందుగా కుటుంబ స‌మేతంగా బాస‌ర‌లోని స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో మ‌న‌వ‌డికి అక్ష‌రాభ్యాసం చేయించారు. అనంత‌రం జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో రూ.200 కోట్ల అంచ‌నా వ్య‌యంతో రూపొందిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో రూ.45.15 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్న‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఆదివాసీల ఇల‌వేల్పు శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.20.10 కోట్ల‌తో ఇక్క‌డ అభివృద్ధి పనులు చేప‌ట్ట‌నున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, బాలిక‌ల‌ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాప‌న చేశారు. ఈ రెండూ క‌లిపి రూ.20 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.15 కోట్ల‌తో ఈ భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు.

బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం వ‌ర‌కు రోడ్డు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.30 కోట్ల‌తో ఈ రోడ్డును నిర్మించ‌నున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం నిర్వ‌హించారు. రూ.20 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మ‌రో 38 అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వీటి అంచనా వ్యయం రూ.30 కోట్లు ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్‌ల‌లో మూడు 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి అంచ‌నా వ్య‌యం రూ 8.99 కోట్లుగా పేర్కొన్నారు. రూ.50.70 కోట్ల‌తో పిప్రి ఎత్తిపోతల పథకానికి, రూ.44.64 కోట్ల‌తో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకం ప‌నులను ప్రారంభించారు. రూ.65.85 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రూ.6.43 కోట్ల‌తో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణం, ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులను సీఎం (CM Revanth) ప్రారంభించారు.

Read Also:  మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>