కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర పాలన అంటే కేవలం నలుగురి చేతుల్లో ఉండే పెత్తనం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఉమ్మడి ప్రతినిధిగా సేవ చేయడమే ప్రజా ప్రభుత్వ అసలు సిసలైన మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఈ పదవులను అధికారంగా భావించడం లేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకులుగా మాత్రమే బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని లీడ్ గా ప్రకటించారు. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఇది అని ఆయన గర్వంగా ప్రకటించారు. రకరకాల అడ్డంకులను అధిగమిస్తూ రెండున్నరేళ్ల కాలంలోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు.
తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో ఎందరో వీరులు అమరులయ్యారని, వారి త్యాగాలకు, తెగువకు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కోటి రతనాల వీణ లాంటి నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని ఆయన పేర్కొన్నారు. మనం కలలు కన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నాటి యుపిఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాళోజీ మాటలే ప్రభుత్వానికి స్ఫూర్తి..
‘పుట్టుక నీది.. చావు నీది, బతుకంతా దేశానిది’ అన్న ప్రజా కవి కాళోజీ నారాయణరావు మాటలే తమ ప్రభుత్వానికి నిరంతర స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. గత రెండున్నరేళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ పట్ల చూపించిన ఆదరణ, అభిమానం మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు, కుట్రలు చేసినా ప్రజలు అండగా నిలవడం తమకు ఎనలేని శక్తిని ఇచ్చిందని, ప్రజల సంక్షేమం పట్ల తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.
రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేరుస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని వినూత్న సంక్షేమ పథకాలను తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నామని గర్వంగా చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు అయితే, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు అని అభివర్ణించారు. పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమ చరిత్రకు ఈ గడ్డ సాక్ష్యమని, ప్రజల మనోభావాలకు ప్రతినిధులుగా, సమాజ ఆకాంక్షలకు వారధులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

