Mobile Popup Ad
Mobile Popup Ad

రాజీపడేదే లేదు .. కృష్ణా, గోదావరి జలాలపై సీఎం ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు తేల్చి, ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని .. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ఈ విషయంలో ఏ వేదిక పైన ఐనా రాజీ లేకుండా, లౌక్యంతో, రాజకీయ విజ్ఞతతో పని చేస్తామని స్పష్టం చేశారు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని సీఎం ఆరోపించారు. పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోందని.. తెలంగాణకు వర ప్రదాయని ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

గోదావరి జలాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటీవలే లేఖ రాశానని సీఎం రేవంత్ అన్నారు. వారితో చర్చించి, తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతామని పేర్కొన్నారు. కాగా, గత ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే కుంగిపోయిందన్న సీఎం.. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడిందని చెప్పారు. ప్రజా శ్రేయస్సు, ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టామని వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సమానం..

ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సమానమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు, బకాయిల కోసం ప్రతినెలా అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని తెలియజేశారు. వారికి ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతను కల్పించే ఈ పథకం దేశ చరిత్రలోనే ఇదే మొదటిదని చెప్పేందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం (EHS) అమలు చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ఇప్పటి వరకు దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామన్న సీఎం.. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో టిమ్స్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కవరేజీని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.

డ్రగ్స్ రహిత తెలంగాణే ధ్యేయం

డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం విషయంలో తాము చాలా పట్టుదలగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్ధాల విషయంలో ఎంతటి వారు ఉన్న ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా EAGLE (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈగల్‌కి దాదాపు 59 వేల మంది యాంటీ డ్రగ్ సైనికులు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. షీ టీమ్స్, టీ-సేఫ్ సర్వీస్ ద్వారా మహిళల భద్రతకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>