కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు భూమి, వ్యవసాయం, రైతు.. ఈ మూడు తెలంగాణకు ఊపిరి అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం – వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు – అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. రైతుల జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పంతో “తెలంగాణ రైజింగ్ – 2047” విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన అని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు, రైతు కూలీలే సారథులేనని వ్యాఖ్యానించారు. దీని కోసం ఈ విజన్ డాక్యుమెంట్ లో “రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ” గా అభివర్ణించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది అని వెల్లడించారు. అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్ అభివృద్ధి చేసి, రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్ప పత్రం ఇది అన్నారు.
ఈ సందర్భంగా 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన వృద్ధి సాధించాయని పేర్కొన్నారు. అయితే రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. తెలంగాణ రైతులు కార్యసాధకులు కావాలంటే అప్పులేని పరిస్థితి ఉండాలన్నారు.
ఇందులో భాగంగా రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి, దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామని వెల్లడించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, విద్యుత్తు పంప్ సెట్లకు సౌరశక్తితో నడిచే పంప్ సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ. 1 లక్షా 56 వేల 496 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ. 27 వేల 529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశామని .. త ఏడాది వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8 వేల 744 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలియజేశారు. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల 700 కోట్ల రూపాయల రైతుభరోసా నిధులను నేరుగా రైతు ఖాతాలలో జమచేశామన్నారు. ఇది అన్నదాతల పట్ల తమ చిత్తశుద్ధికి, వ్యవసాయం పట్ల తమ ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు.

