epaper
Tuesday, November 18, 2025
epaper

సోనియా బర్త్ డే ‘గిఫ్ట్’ సిద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

కలం డెస్క్ : సోనియాగాంధీ బర్త్ డే రోజు (డిసెంబరు 9)న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. రానున్న పదేండ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నది రాష్ట్ర సర్కార్. స్వాతంత్రం ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకునేనాటికి (2047వ సంవత్సరం) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా ఈ విజన్ డాక్యుమెంట్‌లో వివరించనున్నది. ఈ లక్ష్యం సాకారం కావడానికి అవలంబించాల్సిన విధానం, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల పరస్పర సహకారం, ఇతర దేశాల కంపెనీల ఏర్పాటుతో అటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం, యువతకు ఉపాధి అవకాశాలు.. ఇలాంటివన్నీ ఆ డాక్యుమెంట్‌లో ప్రస్తావించనున్నది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా వివిధ రాష్ట్రాల పురపాలక శాఖ మంత్రుల రీజినల్ కాన్ఫరెన్సులో మంగళవారం స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా 2047 నాటికి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా దాదాపు 10% ఉంటుందని సీఎం రేవంత్ ఈ కాన్ఫరెన్సులో పేర్కొన్నారు. విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ అభివృద్ధితోపాటు శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించబోయే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒక డ్రై పోర్టు (సముద్ర తీరం లేని కారణంగా) ఏర్పాటు, మూసీ నది ప్రక్షాళన-అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు గోదావరి నదీజలాల తరలింపు, స్పోర్ట్స్-స్కిల్స్ యూనివర్శిటీల ఏర్పాటు, బహుళజాతి కంపెనీల డాటా హబ్ సెంటర్ల ఫంక్షనింగ్.. ఇలాంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నుంచి కూడా తగిన సహకారం ఉండాలన్నారు.

పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ప్రధాన కర్తవ్యంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వచ్చే ఏడాది కాలంలో దాదాపు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారా నడిపించనున్నట్లు తెలిపారు. దీనికి తోడు ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు సహకరించేలా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపాలని, దాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం బ్యాటరీ వాహనాలపై పూర్తి స్థాయిలో రవాణా పన్నును మినహాయించినట్లు గుర్తుచేశారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తదితర అంతర్జాతీయ నగరాలతో పోటీపడి హైదరాబాద్‌ను ఆ స్థాయికి తీర్చిదిద్దడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Read Also: ఆశ పడటం తప్పెందుకు అవుతుంది: డీకే శివకుమార్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>