కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బెంగళూరులో జరుగుతున్న ‘ది హిందూ హడిల్ 2026’ లైవ్ సెషన్ చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 నెలల్లో 67,700 ఉద్యోగాలు ఇచ్చామని.. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ఇక ఉత్తర, దక్షిణ భారతదేశాల గురించి స్పందిస్తూ.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి.. ఇలా అన్నీ కీలక పదవుల్లో ఉత్తరాది వారే ఉన్నారని వివరించారు. దక్షిణ భారత ప్రజలు పన్నులు కడుతూ, దిల్లీకి సెల్యూట్ కొట్టి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండదల్చుకోలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వచ్చే యూపీ ఎన్నికల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం..
డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసమే ‘ఈగిల్ ఫోర్స్’ ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యాసంస్థల నుంచి బడా నేరగాళ్ల వరకు ఎవరు డ్రగ్స్ తీసుకున్నా ఉక్కుపాదం మోపుతామన్నారు. రాష్ట్రాన్ని పాలించమని కొందరికి అవకాశమిస్తే రూలర్ లా ఫీల్ అవుతారని.. తాను మాత్రం రూలర్‌ని కాదు ప్రజాసేవకుడిని మాత్రమేనని కుండబద్ధలు కొట్టారు.

