Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ విమర్శలకు నిరంజన్ రెడ్డి కౌంటర్

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ శాశ్వత ద్రోహి అంటూ  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. సమైక్య పాలనలో పాలమూరు జిల్లాను గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. కరువు జిల్లాగా ముద్రవేసి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో సింహభాగం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ మరిచిపోయి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణ‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను నోటికొచ్చినట్టు తిడితే.. ఘోరంగా అవమానిస్తే తాను గొప్ప లీడర్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వబోనని.. గద్దెలు కూలుస్తున్నానని రేవంత్ అంటున్నారని.. నిజానికి తన సొంత నియోజకవర్గంలోనే రేవంత్ గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ లీడర్లు రైతుల దగ్గరకు వస్తే వాళ్లే తిరగబడతారంటూ పేర్కొన్నారు.

వెనకబాటుకు కారణం కాంగ్రెస్ పార్టీయే

పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కారణంగానే ఆ ప్రాంతం సర్వనాశనమైందని ఆరోపించారు. పాలమూరు ప్రాంతంపై జరిగిన చారిత్రక నిర్లక్ష్యాన్ని నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ఫజల్ అలీ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాయని గుర్తు చేశారు. తండ్రి చనిపోతే నెత్తిన పోసుకోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు పాలమూరు జిల్లాలో ఉండేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ప్రస్తావించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

జలయజ్ఞం ఒక ప్రాంతానికే పరిమితం

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని ప్రాజెక్టులకు హామీలు ఇచ్చినప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలుకాలేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు తాగు, సాగునీరు ఇచ్చామని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు నింపి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేశామని.. ఈ విషయం ఇక్కడి రైతులకు కూడా తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పాలమూరు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు ఒక ప్రాంతానికే పరిమితమయ్యాయని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా అనేక కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండున్నర ఏండ్లు ఈ జిల్లాను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కడం ఏమిటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనలోనే ప్రాజెక్టులు పరుగులు

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో 68 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా రూపొందించామని, ఇది తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతుందని వివరించారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపిందని, ఇప్పుడు అకస్మాత్తుగా చర్యలు తీసుకుంటున్నట్టు మాట్లాడటం సరికాదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పాలమూరు అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన దృష్టి లేదని, అందుకే ఈ ప్రాంతం వెనుకబడిందన్నారు. రేవంత్ రెడ్డి తరచూ బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, కానీ పాలమూరు అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను గుర్తించడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఏం చేస్తారు? పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి చేస్తారు? అన్న విషయంపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>