కలం, వెబ్ డెస్క్ : కొంతకాలంగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. వర్షాకాలానికి నాంది పలికే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాష్ట్రాన్ని తాకాయని వెల్లడించింది. ఈ మేరకు జూన్ 6 (శనివారం) నాడు రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలను తాకినట్లు స్పష్టం చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత బలాన్ని పుంజుకుని, ఆంధ్రప్రదేశ్ అంతటా వేగంగా విస్తరించడానికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని వివరించింది.
నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావంతో ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది. మరోవైపు రుతుపవనాల రాకతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తొలకరి వేళ ఖరీఫ్ సాగు పనులను ప్రారంభించేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యమైందని చెప్పాలి. గతేడాది , మే 26నే నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో జూన్ 4న కేరళను తాకిన రుతు పవనాలు.. అక్కడి నుంచి రెండు రోజుల్లో ఏపీలో అడుగుపెట్టాయి.
ఇదిలాఉంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.
Read Also: హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

