కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్రంతో మాట్లాడి ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్టు (Adilabad Airport) మంజూరు చేయించామని, వీలైతే జూన్ 2 నాటికి దీని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ఇక్కడ ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పిప్రి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి బాట పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలు హాజరయ్యారు. గతంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సుమారు రూ.614 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆదిలాబాద్ అభివృద్ధికి కార్యాచరణ
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించారు. అభివృద్ధిలో అందరినీ కలుపుకుపోవడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను మంజూరు చేశామని, తాము పాలకులం కాదని ప్రజల సేవకులమని సీఎం వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన హామీలను ప్రకటిస్తూ, ఆదిలాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక రంగంలో భాగంగా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. ప్రేం సాగర్ రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు.
జిల్లాలో అపారమైన సంపద
ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు అమాయకులు అని, ఆత్మగౌరవంతో బతికేవారని సీఎం అన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఆదిలాబాద్ గడ్డకు ఉందన్నారు. నాడు కొమురం భీమ్, రాంజీ గోండ్ వంటి వారు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తి ప్రదాత కొమురం భీమ్ ఆదిలాబాద్ బిడ్డ అని కొనియాడారు. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన అటవీ సంపద ఉందని, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపంతో అభివృద్ధి లేక ఆదిలాబాద్ వెనుకబడిపోయిందని సీఎం చెప్పారు. ఆదిలాబాద్ దాదాపు 60 శాతం అటవీ ప్రాంతం అని, అపారమైన ఖనిజ సంపద, జల వనరులు, ప్రాచీన సంస్కృతి ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. అయినా పరిశ్రమలు రాలేదని, వ్యవసాయం విస్తరించలేదని, విద్యా వైద్యం కూడా ప్రజలకు అందలేదన్నారు.
ఆదిలాబాద్‌లో పూరిగుడిసెలు అలాగే ఉన్నాయని, ఇంకా తాగు నీరు కూడా సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు స్థానిక గూడెంలలో పర్యటించి వచ్చేది మన ప్రభుత్వమే అని, ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంలోకి తీసుకొస్తానని ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చానని సీఎం గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుందని భరోసా కల్పించే వాడని గుర్తు చేశాడు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా గుండె ధైర్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడి ప్రజా పాలన సాధించారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు, అజెండాలు, రాజకీయాలు అని, తర్వాత ఇతర పార్టీల వారు తమకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శాశ్వత శత్రువులు కాదని చెప్పారు. ఆదిలాబాద్ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ఇక్కడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా వందల కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారని, 40 ఏండ్లు దాటినా అదే పరిస్థితి కొనసాగిందని చెప్పారు. ప్రజా పాలన వచ్చిన తర్వాత 3.17 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి సన్న బియ్యం అందించినట్లు చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించామని, ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5,400 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. హైటెక్ సిటీ పక్కన వెయ్యి కోట్ల స్థలాన్ని కేటాయించి, ఆడబిడ్డలు అమ్మే వస్తువులకు మార్కెట్ క్రియేట్ చేశామని తెలిపారు. మహిళా సంఘాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములను చేస్తూ వారి ఉత్పత్తుల కోసం హైటెక్ సిటీలో ప్రత్యేక షాపులు కేటాయించామని వివరించారు.
బోథ్ రెవెన్యూ డివిజన్ పై కీలక ప్రకటన
జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని సీఎం వెల్లడించారు. 2021 మార్చి 31 వరకు సరిహద్దులు మార్చే అవకాశం లేదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం జ్యూడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలను కమిషన్‌కు ఇస్తామన్నారు. బోథ్ ప్రాంతం రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని అడిగారని, ఆ కమిషన్ ద్వారా సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పారు.
జిల్లాలకు ప్రతి రెండు నెలలకు ఒకసారి రాక
నాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తుమ్మిడి హట్టి దగ్గర మొదలు పెట్టి కొడంగల్, వికారాబాద్, తాండూర్ వరకు 160 టీఎంసీల గోదావరి జలాలు తరలించాలని భావిస్తే .. ప్రాణహిత పేరు, ఊరు మారిందని, అంచనాలు కూడా తారుమారై లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లయ్యాందన్నారు. కాళేశ్వరం కడితే మూడేళ్లలో కూలేశ్వరం అయ్యిందని విమర్శించారు. గోదావరి పక్క నుంచే పోతున్నా ఆదిలాబాద్‌కు మాత్రం నీళ్లు రాలేదని స్థానిక నాయకులు చెప్తున్నారన్నారు. నేడు ప్రారంభించిన సాగు నీటి ప్రాజెక్టులతో పాటు, తుమ్మిడి హట్టి నుంచి ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు ప్రారంభిస్తామని, ఆదిలాబాద్‌కు నీళ్లు ఇచ్చి సస్యశ్యామం చేస్తామని చెప్పారు. దీనిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేలు చేస్తున్నారని, అంచనాలు తీసుకుంటున్నారని చెప్పారు. తొందరల్లోనే ప్రాజెక్టు ప్రారంభించి ఆదిలాబాద్‌కు సాగు, తాగు నీరు అందించేందుకు మళ్లీ జిల్లాకు వస్తానన్నారు. ప్రతి రెండు నెలలకోసారి జిల్లాకు వస్తూ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని, ఆదిలాబాద్‌ను పాలమూరుతో సమానంగా అభివృద్ధి చేసి పేదల కళ్లలో ఆనందం చూడటమే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

