Mobile Popup Ad
Mobile Popup Ad

బాల్య వివాహాలను వ్యతిరేకిద్దాం : వనపర్తి కలెక్టర్ పిలుపు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అమ్మాయిలు బాల్యవివాహాలను వ్యతిరేకించాలని, సమాజంలో అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (WANAPARTHY Collector) ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా శనివారం వనపర్తి కలెక్టరేట్ సమావేశమందిరంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలికలు ప్రధాన మంత్రి, స్పీకర్, ఎంపీల పాత్రలను ఎంతో పోషిస్తూ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు.

సమాజంలో ఐక్యత అవసరం

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కిషోర బాలికల కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో ఉన్న సమస్యలపై ప్రశ్నలు అడగడం అభినందనీయమని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించినట్లుగా ప్రతి ఒక్కరూ రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా బలంగా ఉండాలని సూచించారు.

మహిళలు పారిశ్రామికశక్తులుగా ఎదగాలి

ఇందిరా మహిళా శక్తి ద్వారా స్ఫూర్తి పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిపై గళం వినిపించాలని అన్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహ సమాచారం తెలిసినా వెంటనే 1098 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థినులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

డ్రాపౌట్స్ వద్దు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ బాలికలు మధ్యలో చదువులు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యత కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని అవగాహనతో అధిగమించాలని సూచించారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ పోక్సో చట్టంపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రతి విషయాన్ని ప్రశ్నించే అలవాటు పెంపొందించుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని అన్నారు.

నో చెప్పడం అలవాటు చేసుకోండి

అలాగే అవసరమైన సందర్భాల్లో ధైర్యంగా “నో” చెప్పే అలవాటు కూడా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ చెక్కులను, ఎఫ్‌పీఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీవో ఉమాదేవి, డీఎస్పీ బాలాజీ నాయక్, డీసీవో రాణి, డీఐవో జ్యోతి, డీడబ్ల్యూవో సుధారాణి, డీఎంహెచ్‌వో సాయినాథ్ రెడ్డి, డీఐఈఓ నరేంద్ర, కేజీబీవీ అధికారిని, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, విద్యార్థులు, స్నేహ సంఘాల బాలికలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>