Nalgonda DCC | కాంగ్రెస్ పార్టీలో మరోసారి మంత్రి కోటమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వర్గపోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్ష పదవి కేటాయింపుల్లో కోమటిరెడ్డి అనుచరులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ పదవుల కేటాయింపులో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ నల్లగొండ జిల్లా నేత గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మనుషులకే పదవులు ఇచ్చుకున్నారని, తాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy) అనుచరుడిని కావడంతోనే తనను పక్కనబెట్టేశారని ఆయన ఆరోపించారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై గుమ్ముల మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజాయితీగా జెండాలు మోసిన నేతలకు కాంగ్రెస్ న్యాయం జరగదని, బూతులు తిట్టిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లగొండ డీసీసీ(Nalgonda DCC) అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఆశపడ్డానని, కానీ తనకు పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందని అన్నారు. ‘‘నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావు. కులమే నా పదవికి అడ్డంగా మారింది. పార్టీ ఏ కార్యకమాలకు పిలుపునిచ్చినా నిబద్ధతతో పని చేశా’’ అని అన్నారు. నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జున సాగర్లో నాయకులంతా తన పేరే చెప్పారని, కానీ పదవి మాత్రం తనకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తాను మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిని కావడం వల్లే తనకు పదవి రాకుండా చేశారన్న గుమ్ముల ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదాలు ఏమీ లేవు కదా..? మరి ఆయన అనుచరుడికి పదవి రాకుండా సీఎం ఎందుకు అడ్డుకుంటారు? అన్న చర్చలకు దారి తీసింది. గుమ్ముల వ్యాఖ్యలు పార్టీలో కూడా అంతర్గత విభేదాలకు దారితీస్తున్నాయి. మరి అతని వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also: వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ క్రిమినల్స్
Follow Us on: Youtube


