కలం, వరంగల్ బ్యూరో: ఒకప్పుడు వాళ్లిద్దరూ మంచి మిత్రులు. ఒకే పార్టీ. ఓకే నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోటీచేసి గెలుపొందారు కూడా. కానీ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఒకరు హస్తం గూటికి చేరగా, మరొకరు బీఆర్ఎస్‌లో ఉన్నారు. పార్టీ మారిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి పంచాయితీ ఓరుగల్లు రాజకీయాల్లో(Warangal Politics) ప్రకంపనలు పుట్టిస్తోంది.
సై అంటే సై
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. కేసీఆర్(KCR) కుటుంబం చిన్నాభిన్నం కావడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రధాన కారణమని కడియం ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు మధ్య కూడా విభేదాలు తలెత్తడానికి కూడా కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పంచన చేరి అడ్డగోలుగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ‘కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని, కవిత చెబుతున్నట్లగా పల్లా పెద్ద కొరివి దెయ్యం’ అని కడియం వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపాయి. దీంతో పల్లా వర్గీయలు కడియం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడియంపై వార్
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి (Kadiyam Srihari) వెంటనే పదవికి రాజీనామా చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ‘తన బిడ్డను ఎంపీగా చేయడం కోసమే కడియం పార్టీ మారడని, అలాంటి వ్యక్తికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి’ అని ఇటీవల జరిగిన స్థానిక పోరులో పల్లా ప్రచారం నిర్వహించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే ఒకవైపు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) ఇష్యూ కొనసాగుతుండగా, మరోవైపు కడియం-పల్లా వార్‌తో ఓరుగల్లు రాజకీయాలు(Warangal Politics) వేడెక్కాయి.
Read Also: రేవంత్ చెప్పిందే స్పీకర్ చేస్తున్నారు : కేటీఆర్
Follow Us On: Pinterest


