Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ ఐదేళ్లూ పండుగలు జరుపుకోలేని పరిస్థితి: CM చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పరాభవ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో (Tummalapalli Kalakshetram) రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సీఎంతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్‌, కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సిద్ధాంతి మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సిద్ధాంతి మాడుగుల నాగఫణిశర్మకు భగవంతుడు చక్కని వాక్చాతుర్యం ఇచ్చారని కొనియాడారు. పరాభవ నామ సంవత్సరం అన్నివిధాలుగా బాగుంటుందని చెప్పారు. ఉగాది పచ్చడి.. మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

షడ్రుచులు మాదిరిగానే మన జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో… పంచాంగ శ్రవణం కూడా అలానే వింటామని చెప్పారు. 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు ఇస్తున్నామని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయని అన్నారు. మంచి, చెడులను గుర్తుచేసుకునే సమయం పండుగ రోజు అని కొనియాడారు. తాను సీఎంగా ఉన్నప్పుడే మూడోసారి గోదావరి పుష్కరాలు (Godavari Pushkaralu) చేస్తున్నామని గుర్తు చేశారు. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయన్నారు. ప్రస్తుతం మన రిజర్వాయర్లలో 65 శాతంమేర నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. మే 15నే సాగుకు నీరు విడుదల చేస్తామని.. నారుమళ్లు వేసుకోవాలని ముందే చెప్పామన్నారు.

విలువలు పతనమైన రోజు జీవితాలు భ్రష్టుపడతాయని ప్రజలకు సీఎం చంద్రబాబు (Chandrababu) దిశానిర్దేశం చేశారు. ఐటీ జీవనోపాధి కల్పిస్తే, సంస్కృతి సంప్రదాయాలు విలువలు పెంపొందిస్తాయన్నారు. ఆనాడు ఐటీని ప్రోత్సహించానని.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు ఉన్నారని అన్నారు. సంపద కొంతమందికే సొంతం కాకూడదని.. అందరూ ఆనందంగా ఉండాలని అభిలషించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నామన్నారు. రాజధాని నగరం అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కుట్రల పట్ల ఏమరుపాటు లేకుండా రాజీలేని పోరాటం చేస్తానని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024కు ముందు ఐదేళ్లూ పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే జరిగాయన్నారు. అందరూ బాగుండాలనే ప్రణాళికతో తమ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: ఉగాది పురస్కారాలు అందజేసిన సీఎం చంద్రబాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>