కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అరెస్టుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన్ను అరెస్ట్ చేసి తంజావూరుకి తరలిస్తుండగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎంకే కార్యకర్తలు సీఎం విజయ్ ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించారు. వెంటనే స్పందించి టీవీకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తంజావూరు టౌన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉదయనిధిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం హైకోర్ట్ అత్యవసర విచారణ చేయబోతున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
ప్రతిపక్ష నేత అరెస్ట్ సరికాదు: కనిమొళి
ఉదయనిధి అరెస్టుపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. “ప్రతిపక్ష నాయకుడి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే కేసులు పెట్టుకోండి. కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతే తప్ప.. ప్రతిపక్ష నేతను ఇలా అరెస్ట్ చేయడం సరికాదు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఉదయనిధిని అరెస్ట్ చేయడం దారుణం. టీవీకే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులను అణచివేసే చర్యలను మానుకోవడం ఉత్తమం” అన్నారు.

