కలం, తెలంగాణ బ్యూరో : దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని తీరులో కులగణనను సక్సెస్ చేశామని తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. కులాలవారీ లెక్కలన్నింటినీ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఆ లెక్కల్లో తప్పులున్నాయని పలు కుల సంఘాల పెద్దలు చేసే విమర్శలు, పెదవి విరుపులు ఎలా ఉన్నా ఆ జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు, పార్టీ (Telangana Congress) పదవుల్లో ప్రాధాన్యత ఉండాల్సిందేనని పలు బీసీ కులాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. బీసీల్లో కేవలం ఆ రెండు కులాలకే ప్రయారిటీయా అంటూ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నా మిగిలిన బీసీ కులాలకు ఆ ప్రాధాన్యత ఎందుకు లేదన్నది వారి వాదన. మే నెలలో నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ ప్రకటించడంతో ఆశావహుల నుంచి ఒత్తిడి పెరిగింది.
రాహుల్‌గాంధీ మాటలను ప్రస్తావిస్తున్న నేతలు :
‘జిత్‌నీ ఆబాదీ.. ఉత్‌నీ హక్’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రస్తావించారు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీ, స్కీమ్ తేవాలన్నా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారో తెలియాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి కులగణనపై మంత్రివర్గం చర్చించి పాజిటివ్ నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత ఐదారు నెలలకే రాష్ట్రంలో అన్ని ఇండ్లకూ తిరిగిన ప్రభుత్వ సిబ్బంది కులగణన వివరాలను సేకరించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు పెడుతున్న సమయంలో కులగణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కులాల సంఘాలకు బలం చేకూరినట్లయింది. అందుకే జనాభాకు తగినట్లుగా ఆ కులానికి ప్రాధాన్యత ఇవ్వలని ఒత్తిడి మొదలైంది.
కులగణన వివరాలే ఇప్పుడు పార్టీకి తలనొప్పి :
రాహుల్‌గాంధీ ప్రస్తావించిన బీసీ నినాదమే ఇప్పుడు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. బీసీల ఛాంపియన్‌గా నిలుద్దామనుకున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ బీసీ నేతల నుంచే ఒత్తిడి పెరిగింది. కుల సర్వేలో వెల్లడైన గణాంకాల ఆధారంగా ప్రాతినిధ్యం ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు. జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ‘మేమెంతో మాకంత’ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్‌గాంధీ గతంలో ఇచ్చిన స్లోగన్‌ను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ అనే గుర్తింపు ఉన్నద, అది పార్టీకి గుండెకాయ లాంటిదనే అంశాన్ని గుర్తుచేస్తున్నారు. ఎవరికి ఏ అవకాశాలు దక్కాలో కులగణనతోనే క్లారిటీ వస్తుందని రాహుల్‌గాంధీ గతంలో ప్రస్తావించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ మాటను కాదనలేక, రాష్ట్రంలోని కులాల గణాంకాల ప్రకారం ఇవ్వడంలోని ఇబ్బందులను అధిగమించలేక పీసీసీ నాయకత్వం సతమతమవుతున్నది.
పదవులన్నీ ఆ రెండు కులాలకేనా? :
తెలంగాణ కులగణన గణాంకాల ప్రకారం ముదిరాజ్, యాదవ్ సామాజికవర్గాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ముదిరాజ్ జనాభా 26 లక్షల (7.4%) పైచిలుకు ఉంటే యాదవులు 20 లక్షల (5.7%) పైచిలుకు ఉన్నది. ఇంత భారీ జనాభా ఉన్నందున అవకాశాలూ అదే స్థాయిలో ఉండాలని ఆ కులాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పార్టీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌కు మొరపెట్టుకున్నారు. జనాభా ప్రకారమే కార్పొరేషన్ పదవులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా ఆ రెండు బీసీ సామాజికవర్గాలకే పదవులు దక్కుతున్నాయన్నారు. ఇప్పటివరకు 12 మంది గౌడ్స్, 10 మంది మున్నూరుకాపు లీడర్లకు పదవులు దక్కాయని గుర్తుచేశారు. అత్యధికంగా ఉన్న ముదిరాజ్, యాదవ సామాజికవర్గాలకు మాత్రం మొండి చేయి ఎదురవుతున్నదన్నారు. త్వరలో చేపట్టబోయే కార్పొరేషన్ పదవుల్లో ముదిరాజ్, యాదవ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సీఎం, పీసీసీ చీఫ్ అనుసరించనున్న క్యాస్ట్ ఈక్వేషన్, సోషల్ జస్టిస్ ఫార్ములా కీలకంగా మారింది.
Read Also: మే చివరి నాటికి 2BHK ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి: పొంగులేటి
Follow Us On : WhatsApp

