కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణమైన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను (Double Bedroom Houses) అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని సంబంధిత అధికారులకు రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) ఆదేశాలు జారీచేశారు. మే నెల చివరి నాటికి ఈ టాస్క్ కంప్లీట్ కావాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయ్యి కేటాయింపు మాత్రమే మిగిలిన ఉన్న ఇండ్లను అధికారులు ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హౌసింగ్ రెవెన్యూ, ఫారెస్టు అధికారాలతో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో పై క్లారిటీ ఇచ్చారు.
నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నట్లయితే నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో, జాబితా తయారీలో సమస్యలు, అసంతృప్తి లేకుండా పటిష్టమైన మెకానిజాన్ని రూపొందించాలన్నారు. ఫినిషింగ్ టచ్‌లో ఉన్న ఇండ్లకు ఇప్పటివరకు అయిన ఖర్చుతో సంబంధం లేకుండా ఇకపైన అయ్యే ఖర్చును ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ నుంచి అందజేస్తామని అధికారులకు క్లారిటీ ఇచ్చారు. చాలాచోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడానికి ఆసక్తి చూపని కారణంగా లబ్ధిదారులే ప్రభుత్వ డబ్బులతో పూర్తి చేసుకోడానికి ఈ విధానం వీలవుతుందని వివరించారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా క్లియరెన్స్ ఇస్తామన్నారు.
కనీస సౌకర్యాలను కల్పించాలని మంత్రి ఆదేశం :
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ కనెక్షన్లతో పాటు రోడ్డు సౌకర్యం లాంటి కనీస వసతులు కల్పించాలన్నారు. చాలా ఇండ్లలో అర్హత లేని కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇవన్నీ అనధికారమైనవేనని, ఆ కుటుంబాలను తొలగించి అర్హులకు ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి (Ponguleti) దృష్టికి తీసుకొచ్చారు. అర్హత లేనివారు ఉన్నట్లయితే తక్షణమే తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులైనవారికి కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో ప్రభుత్వం రూ. 400 కోట్ల ఖర్చుతో మౌలిక వసతుల కల్పిస్తున్నట్లు తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో, అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వ సిబ్బందిని సస్పెన్షన్‌తో మాత్రమే సరిపెట్టకుండా సర్వీసు నుంచే తొలగించడానికి వెనకాడబోమని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కలెక్టర్ల బాధ్యతే :
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి (Ponguleti) స్పష్టం చేశారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 దరఖాస్తులను ఎప్పుడు చేశారనేది ప్రధానం కాదని, అర్హులైన కుటుంబాల పేదరికమే ప్రామాణికమన్నారు. అర్హులైన వారిని గుర్తించి ఇండ్లను మంజూరు చేయడం కలెక్టర్ల బాధ్యత అని నొక్కిచెప్పారు. ఫస్ట్ ఫేజ్‌లో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోనివారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందచేస్తున్నామని గుర్తుచేశారు. లబ్దిదారుల ముసుగులో ఇసుక దారి మళ్లుతున్నదనే సమాచారం వచ్చిందని, అర్హులకు మాత్రమే ఇసుక అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్టమైన వ్యూహం కోసం పాలసీని రూపొందించాలన్నారు. సూచించారు నగరానికి దూరంగా డబుల్ ఇండ్ల కాలనీలు ఉన్నందున లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్టపడటంలేదని, దీంతో అద్దెకి ఇచ్చి మళ్లీ నగరంలోకే వెళ్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ఇలాంటివారిని గుర్తించి, నివసించేవారికి మాత్రమే కేటాయించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు.
రెవెన్యూ, ఫారెస్టు భూముల వివాదానికి పరిష్కారం :
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్త లేదని నొక్కిచెప్పిన మంత్రి.. ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు విభాగాలకు చెందిన భూములకు సరిహద్దు నిర్ధారణపై వివాదాలున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. రెండు విభాగాల ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో జాయింట్ సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలన్నారు. సూచించారు. భవిష్యత్తుల్లో వివాదాలకు ఆస్కారం ఉండదన్నారు. భూ పరిపాలనను బలోపేతం చేసేందుకు సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. భూ రికార్డుల్లో పాదర్శకత, ఖచ్చితత్వం తీసుకుని రావడం కీలకమైన అంశమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, హౌజింగ్ కార్యదర్శి వీపీ గౌతం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: ‘వెంటనే కూల్చేయాలి’.. హైడ్రా బిగ్ అలర్ట్!
Follow Us On: Instagram

