epaper
Tuesday, November 18, 2025
epaper

మైనర్లతో కేటీఆర్‌ ప్రచారం.. ఈసీకి ఫిర్యాదు

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. పోటాపోటీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేటీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో కేటీఆర్ మైనర్లతో ప్రచారం చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన షఫీయుద్దీన్‌ అనే ఓటరు ఈ మేరకు ఫిర్యాదు సమర్పించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ పిల్లలను రాజకీయ కార్యక్రమాల్లో ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“కేటీఆర్‌ ఉద్దేశపూర్వకంగా చిన్నారులను ప్రచారంలో భాగం చేయడం ద్వారా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలి” అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు రిటర్నింగ్‌ అధికారికి చేరడంతో అధికారులు సంబంధిత వీడియోలు, ఫోటోలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కేటీఆర్‌ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓటర్లను ఉద్దేశించి ఆయన “ఓటుకు రూ.5 వేలు తీసుకోండి, కానీ బీఆర్ఎస్‌కే ఓటేయండి” అని మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వ్యాఖ్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. “ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. బీఆర్ఎస్‌ నేతల ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు ప్రస్తావన చేయడం చట్టపరంగా నేరం. ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి” అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

అంతా కుట్రపూరితం: KTR

కేటీఆర్‌ మాత్రం తనపై జరుగుతున్న విమర్శలను కాంగ్రెస్‌ నేతల కుట్రగా అభివర్ణించారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. “కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారాన్ని దారి మళ్లించేందుకు, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని” కేటీఆర్‌ పేర్కొన్నారు. కమిషన్‌ అధికారులు అయితే ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

క్లైమాక్స్‌కు ప్రచారం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌ దశకు చేరుకున్నది. కేటీఆర్‌ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదాలు బీఆర్ఎస్‌ శిబిరంలో ఆందోళనకు కారణమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం ఈ అంశాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో వచ్చే రోజుల్లో ఈ ఫిర్యాదు, వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Read Also: ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమా?

Follow Us On : Instagram 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>