డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డానన్న అవమానభారంతో ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. అయితే పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుషాయిగూడ(Kushaiguda) ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా దమ్మాయిగూడకు చెందిన ఆటో డ్రైవర్ మీన్‌రెడ్డి (35) పట్టుబడ్డాడు. పరీక్షలో (బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో) 120 రీడింగ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
ఆ తర్వాత మీన్‌రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆటోనే జీవనాధారమని, అది లేకుండా కుటుంబాన్ని పోషించలేనని అతడు ఇంట్లో భార్యకు చెప్పినట్టు సమాచారం. రాత్రి దాదాపు 12 గంటల సమయంలో కుషాయిగూడ(Kushaiguda) ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి, తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు చెలరేగడంతో స్థానికులు, అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు పరుగున వెళ్లి మంటలను ఆర్పేందుకు యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో మీన్‌రెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందాడు.
ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మీన్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే మీన్‌రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోయి ఉంటే ఈ ప్రాణనష్టం జరగేది కాదని వారి వాపోయారు. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow Us on : Youtube

