కలం, వెబ్ డెస్క్: సమ్మక్క, సారక్క జాతరలో జరిగిన ఓ వివాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదైంది. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంక( Veenavanka) మండలంలో జరుగుతున్న జాతరకు కౌశిక్ రెడ్డి కుటుంబసమేతంగా వెళ్లారు. అక్కడ సర్పంచి కొబ్బరికాయ కొట్టే విషయంలో గొడవ చోటు చేసుకుంది. దీంతో ఘర్షణ జరిగే సూచనలు ఉండటంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని, ఆయన సతీమణిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు, కౌశిక్ రెడ్డి వర్గీయులకు తోపులాట జరిగింది. దీంతో కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. అంతకు ముందు సైతం కౌశిక్ రెడ్డి జాతరకు భారీ ర్యాలీతో రాగా, పోలీసులు అడ్డుకున్నారు. పరిమితికి మించి వాహనాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులకు , కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ రెండు ఘటనల్లో పోలీసులపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వచ్చేది మా ప్రభుత్వమే, తర్వాత మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టం 126(2), 132, 196, 299, ఇతర సెక్షన్ల కింద కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.


