కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసన మండలిలో గందరగోళం మొదలైంది. కాసేపటి క్రితమే సభ ప్రారంభం కాగా.. బీఆర్ఎస్ (BRS) సభ్యులు నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) పోడియం వరకు బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లి ప్లకార్డులు చూపించి పేపర్లు చించేశారు. వెంటనే మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బీఆర్ఎస్ తీరుపై శాసన మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో సభ్యులు గౌరవంగా నడుకోవాలని చెప్పారు. సభను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభకు ఆటంకాలు సృష్టిస్తన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించారు. తల్లిదండ్రులను పిల్లలు ఆదుకునే విషయంలోనూ అడ్డు తగులుతున్నారని, బీఆర్‌ఎస్ సభ్యుల ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రయోజనాలు తప్పితే, ప్రజా ప్రయోజనాలు పట్టట్లేదని ఆగ్రహించారు.

