జీవో 317 నివేదిక ఎక్కడ? : సీఎంకు కవిత బహిరంగ లేఖ

కలం, వెబ్ డెస్క్ : జీవో 317 వల్ల తమ కుటుంబాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వం హయాంలో జారీ అయిన ఈ జీవో వల్ల వేలాది మంది ఉద్యోగులు తమ స్థానికతను కోల్పోయి అన్యాయానికి గురయ్యారని, వారికి వెంటనే ‘వన్ టైమ్ రిలీఫ్’ కింద సొంత జిల్లాలకు బదిలీ అయ్యేలా అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సీనియారిటీ ప్రాతిపదికన జరిగిన కేటాయింపుల్లో భాగంగా, తక్కువ సర్వీస్ ఉన్న వారు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆమె లేఖలో గుర్తు చేశారు.

నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఇదే అంశంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసిన విషయాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కవిత ప్రస్తావించారు. ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నాయకులు కూడా గతంలో బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఈ సమస్య పరిష్కారానికి శాంతి కుమారి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ నివేదికను బయట పెట్టకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మధ్యలో జారీ చేసిన పలు జీవోలు బాధితులకు ఎలాంటి ఉపశమనం కలిగించలేకపోయాయని ఆమె విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఏర్పడిన ఖాళీలలో, జీవో 317 బాధితులకు వారి స్వస్థలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ఆమె కోరారు. నిరుద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు. ఉద్యోగుల మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకుని, స్థానికత నిబంధనల్లో సమూల మార్పులు చేస్తూ తక్షణమే ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కవిత (Kavitha) విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>