కలం, కరీంనగర్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితె తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.
ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ శాఖల శకటాలను స్టాళ్లను ప్రదర్శించారు. స్త్రీ నిధి ద్వారా జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఈ స్కూటీ, ఈ ఆటోలను ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ అతిథులతో కలిసి పంపిణీ చేశారు. రూ.లక్ష విలువైన ఈ స్కూటీలు 24 మందికి, రూ.14 లక్షల 25 వేల విలువైన ఈ ఆటోలను అందజేశారు. 855 మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు రూ. 100 కోట్ల 12 లక్షలు, అలాగే 847 సంఘాలకు స్త్రీ నిధి రూ. 20 కోట్ల 66 లక్షల రుణాలను పంపిణీ చేశారు.
టీవీసీసీ స్కీమ్ కింద జిల్లాలోని పలువురు దివ్యాంగులకు ఆటో, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ పంపిణీ చేశారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన దుంపేటి కుమారస్వామికి ఎలక్ట్రిక్ ఆటో, గుర్రంవాణిపల్లికి చెందిన కంది తిరుమల్ రెడ్డి, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కొమిరే పరశురాముకు హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ను అందజేశారు.

