బీఆర్ఎస్‌కు ఆక్సిజ‌న్‌లా బండి భగీరథ్ పోక్సో కేసు!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్‌ (Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రంలో పొలిటికల్ ఇష్యూగా మారింది. తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరగొచ్చనే ఊహాగానాలకు తావిచ్చింది. బీజేపీ (BJP) నైతికంగా డీమోరల్ అవుతున్నదని అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బలపడడానికి ఇదే తగిన సమయం అని భావిస్తున్నది. ఇంతకాలం వరుస ఓటములతో డీలా పడడంతో తాజా పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నది. బండి సంజయ్‌ను డిఫెన్సులో పడేసేలా వారం రోజుల నుంచి పోక్సో కేసు ఇష్యూపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి, మహిళా సంఘాలు డీజీపీ ఆఫీస్, పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ దగ్గర ధర్నాలు నిర్వహించాయి. ఏకకాలంలో కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశాయి. బండి భగీరథ్‌ జ్యుడిషియల్ రిమాండ్ పరిణామం బీఆర్ఎస్‌కు ఆక్సిజన్‌గా మారింది.

బీఆర్ఎస్‌కు రాజకీయ అస్త్రంగా పోక్సో కేసు :

బండి భగీరథ్ (Bandi Bhagirath) అంశాన్ని బీఆర్ఎస్ తొలి రోజు నుంచీ రాజకీయ కోణం నుంచే చూస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగం వారం రోజులపాటు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశాయి. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నాయి. బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని, శిక్షించాలని డిమాండ్ చేశాయి. భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషపడ్డాయి. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా సైతం బండి భగీరథ్ అంశాన్ని నెగెటివ్ కోణం నుంచి ప్రచారం చేశాయి. జిల్లా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో బీఆర్ఎస్ పొలిటికల్‌గా పైచేయి సాధించినట్లయింది. ఇకపైన బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనున్నది?.. బండి భగీరథ్‌ ఎపిసోడ్‌ను పొలిటికల్‌గా ఎలా వాడుకోబోతున్నది?.. తాత్కాలికంగా బీజేపీ నుంచి పొలిటికల్ థ్రెట్ తగ్గినట్లేనా?.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున మాటలు.

ప్రధాన ప్రతిపక్షం కోసం పోటీ :

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ (BRS Party) ప్రధాన ప్రతిపక్షమే అయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం నెలకొన్నది. దీంతో సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పోటీ అనివార్యమవుతున్నది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో బండి భగీరథ్ ఇష్యూతో బీజేపీని కార్నర్ చేసి సెకండ్ ప్లేస్‌కు రావాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. బీజేపీకి ఇబ్బందికరంగా మారిన బండి భగీరథ్ పరిస్థితిని ఇప్పుడు అనుకూలంగా మల్చుకోలేకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కోసం ఈ రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంటుంది. ఈసారి బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా రానివ్వనంటూ ఈ నెల 6న జరిగిన బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఓపెన్‌గానే సవాలు విసిరారు. దీంతో బీజేపీ ప్రస్తుత వీక్‌నెస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని బీఆర్ఎస్ బలపడే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి.

‘బేటీ బచావో’ స్లోగన్‌తో మోదీ టార్గెట్ :

సనాతన ధర్మం, సంప్రదాయాలు, సంస్కృతి, నైతికత, కుటుంబ విలువలు.. ఇలాంటి అంశాలను బీజేపీ ఏకరువు పెడుతుందని, ఇప్పుడు పార్టీకే మచ్చ తెచ్చిన బండి సంజయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ఆ పార్టీ పెద్దలను బీఆర్ఎస్ నేతలు కార్నర్ చేస్తున్నారు. ‘బేటీ బచావో’ అంటూ ప్రధాని మోదీ గొప్పగొప్ప మాటలు చెప్తున్నారని, కానీ బేటీని బద్నాం చేసే తీరులో బండి సంజయ్ వ్యవహారం ఉంటే ఆయనపై చర్యలేవని ప్రశ్నించారు. ఒక బేటీ బాధితురాలిగా ఉంటే ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యతల్లో ఉండి ‘హనీ ట్రాప్’ అంటూ ఆమెనే నిందితురాలిగా చేసే ప్రయత్నాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బాధితురాలి పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని గులాబీ లీడర్లు చెప్పుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి కొడుకు పోక్సో కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌కు వెళ్తే మంత్రి పదవిలో కొనసాగే అర్హతే బండి సంజయ్‌కు లేదని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: మద్యం రేట్ల పెంపుపై ఎక్సయిజ్ శాఖ ఎక్సర్‌సైజ్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>