కలం, ఖమ్మం బ్యూరో: కష్టాల్లో ఉన్నవారికి సకాలంలో అందే సాయం దేవుడి వరంతో సమానం. ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా, చావు బతుకుల మధ్య ఉన్న ఒక పసిపాపకు పునర్జన్మ ప్రసాదించి రియల్ హీరోగా నిలిచారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (Abhishek Augustya). వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేష్, మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ జన్మించింది. ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనేలోపే దారుణమైన నిజం వెలుగు చూసింది. పాప పుట్టిన 12 రోజులకే తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్సకు రూ. 14 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ పేద కుటుంబం కోలుకోలేని దిగ్భ్రాంతికి గురైంది.
అండగా నిలిచిన ‘అభిషేక్ అగస్త్య’
ఈ విషయాన్ని ఖమ్మం నగరపాలక సంస్థలో శానిటేషన్ కార్మికురాలిగా పనిచేస్తున్న పాప నానమ్మ నరసమ్మ… మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి తీసుకువెళ్లారు. పసిపాప పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన కమిషనర్ వెంటనే స్పందించారు. ‘హృదయ’ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ఆపరేషన్‌కు కావలసిన రూ.14 లక్షల ఆర్థిక సహాయం త్వరితగతిన మంజూరయ్యేలా చొరవ చూపారు.
విజయవంతంగా శస్త్రచికిత్స
కమిషనర్ చొరవతో మంజూరైన ఆర్థిక సాయంతో జూలై 28న చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆ పసిపాప సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంది. తన బిడ్డ ప్రాణాలు నిలిపిన దేవుడిలాంటి కమిషనర్‌ను కలవడానికి తల్లిదండ్రులు పాపను సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమానికి తీసుకువచ్చారు. తమ కుటుంబానికి చేసిన మేలుకు కన్నీటిపర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, తమ కుమార్తెకు కమిషనర్ పేరు పెట్టాలని కోరారు. ఆ దంపతుల అభిమానానికి సంతోషించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆ చిన్నారికి ‘జస్విక శ్రీ’ అని నామకరణం చేశారు. పాప నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగాలని ఆశీర్వదించారు.అధికారంతో పాటు మానవత్వం కూడా తోడైతే ఒక ప్రాణాన్ని ఎలా కాపాడవచ్చునో నిరూపించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉదారతపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

