కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ను (Krishank) పోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్వాడీ ఫోన్ల కొనుగోళ్లలో మంత్రి సీతక్క భారీగా అవినీతికి పాల్పడినట్లు గత కొన్ని రోజులుగా క్రిశాంక్ ఆరోపణలు చేస్తున్నారు. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. ఆధార రహితమైన ఆరోపణలు చేశారంటూ క్రిశాంక్ పై పోలీసులకు మంత్రి సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కూకట్పల్లి నివాసం నుంచి పోలీసులు ఆయనను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ కేసులను ఎదుర్కొంటాం..
మంత్రి సీతక్క అంగన్వాడీ ఫోన్లలో అవినీతిని ప్రశ్నించినందుకు, మరో మంత్రి పొంగులేటి సొంత కంపెనీ కొత్వాల్ గూడలో చేస్తున్న అక్రమ మైనింగుని ఆధారాలతో సహా బయటపెట్టినందుకే కేసులు పెట్టి అరెస్టులు చేసి తనను వేధించాలని చూస్తున్నారని గురువారం మధ్యాహ్నం క్రిశాంక్ ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులను ఎదుర్కొంటామని.. ఈ ప్రభుత్వానికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.

