కలం, తెలంగాణ బ్యూరో : మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) పదవి గాలిలో దీపంలాగా తయారైంది. ఆయన మంత్రిగా కొనసాగుతారా? లేక రాజీనామా చేయాల్సి ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొన్నది. ఈ నెల 30 లోగా ఆయన ఎమ్మెల్సీ అయితేనే మంత్రిగా కొనసాగే అర్హత ఉంటుంది. లేనట్లయితే మంత్రిపదవికి రాజీనామా చేయక తప్పదు. ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపేందుకు గవర్నర్‌కు మరికొంత సమయం కావాలంటూ ఆయన తరఫున అటార్నీ జనరల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో ఈ నెలాఖరులోగా సానుకూల నిర్ణయం రావడం అనుమానంగా తయారైంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలకపోతే వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకోక తప్పదు. అటు ఎమ్మెల్యేగానూ, ఇటు ఎమ్మెల్సీగానూ లేకుండా గతేడాది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం మంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లో ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. దీంతో మంత్రివర్గం నుంచి వైదొలగ తప్పని పరిస్థితి నెలకొన్నది.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఇటీవలే ముఖ్యమంత్రి భేటీ :
ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌లను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్‌కు గతంలో సిఫారసు చేసింది. దీర్ఘకాలంగా ఈ అంశం గవర్నర్ ఆమోదానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నది. వీరిద్దరి నామినేషన్‌ను సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇది వివాదంగా మారింది. గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు సంపూర్ణాధికారం ఇచ్చింది. ఆ ప్రకారం గవర్నర్ ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కానీ జాప్యం జరుగుతుండడంతో ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్ళి త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ఈ నెల 30 నాటికి అజారుద్దీన్ మంత్రి అయ్యి ఆరు నెలల గడువు పూర్తవుతున్నందున అప్పటికల్లా ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉన్నదని గవర్నర్‌కు గుర్తుచేశారు. సానుకూల స్పందనే వస్తుందని సీఎం సహా మంత్రులంతా ఆశించినా సుప్రీంకోర్టులో గవర్నర్ తరపున అటార్నీ జనరల్ కోరిన గడువు అనుమానాలకు తావిచ్చింది.
మంత్రిగా దిగిపోతే మరో కీలక నామినేటెడ్ పదవి :
ఒకవేళ గడువు లోగా అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా గవర్నర్ ప్రకటించకపోతే ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అజారుద్దీన్‌కు ప్రభుత్వం మరో కీలక నామినేటెడ్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఇప్పటికే మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అజారుద్దీన్ రాజీనామా చేస్తే మూడు బెర్తులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఎదురు చూస్తున్న సమయంలో విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుందోననే ఆశలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన ఉంటుంది, ఎవరికి కొత్తగా అవకాశం లభిస్తుందనే అంచనాలు ఎలా ఉన్నా అజారుద్దీన్‌కు ఇచ్చే నామినేటెడ్ పదవి ఏంటనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో మొదలైంది.

