కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు జరగనున్నది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేలా ఎజెండా రూపొందినప్పటికీ తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్‌గా మారే అవకాశమున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జనాభా లెక్కల సేకరణ, 99 రోజుల ప్రణాళిక, మెట్రో రైల్ విస్తరణ.. ఇలాంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. కానీ కాళేశ్వరం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టడం, ఆ నివేదిక ప్రకారం కేసీఆర్, హరీశ్‌రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తీర్పులో పేర్కొనడం రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇది రాజకీయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారడంతో దీనిపై తదుపరి యాక్షన్ ప్లాన్‌పై ప్రభుత్వం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
బీఆర్ఎస్‌కు నైతిక విజయంగా హైకోర్టు తీర్పు :
కాళేశ్వరం ప్రాజెక్టులో కరప్షన్‌కు పాల్పడ్డారని, వేల కోట్ల రూపాయలు దిగమింగారని, ఆ కారణంగానే నాణ్యత లేని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయని, మూడేండ్లకే ప్రాజెక్టు పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని.. ఇలా అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించింది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు ఉప్పు-నిప్పుగా మారింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టులో సకల లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు (Harish Rao) నిర్లక్ష్యమే కారణమని నివేదికలో జస్టిస్ ఘోష్ పేర్కొన్నారు. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీబీఐ దర్యాప్తుకు అప్పగించేలా ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగింది. దానికి కొనసాగింపుగా సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, హరీశ్‌రావులపై ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు తన తీర్పులో నొక్కిచెప్పడం బీఆర్ఎస్‌కు నైతికం విజయం లభించినట్లయింది.
బాధ్యులకు శిక్ష పడాల్సిందేననే ధోరణిలో ప్రభుత్వం :
పదుల సంవత్సరాలు నిలవాల్సిన బ్యారేజీ మూడేండ్లకే కుంగిపోవడం అనేక రకాల నిర్లక్ష్యానికి కారణమని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నది ప్రభుత్వ వాదన. బాధ్యులెవరో తేల్చి వారిని చట్టపరంగా శిక్షించాలన్న లక్ష్యంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో దోషుల్ని తేల్చడం మళ్లీ మొదటికొచ్చింది. కమిషన్ నివేదికలోని మెరిట్స్ జోలికి వెళ్ళకుండా విచారణ జరిగిన తీరులో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి చెప్పింది. దీంతో దోషుల్ని తేల్చడానికి మరో విచారణ, దర్యాప్తు అవసరమని స్పష్టమైంది. దీంతో తదుపరి కార్యాచరణ ప్రణాళికపై మంత్రులంతా చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. తాజా తీర్పు నేపథ్యంలో మరోసారి ఇలాంటిది పునరావృతం కాకుండా ప్రభుత్వం మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
Read Also: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం
Follow Us On: X(Twitter)

