Mobile Popup Ad
Mobile Popup Ad

వాంఖడేలో చెన్నై వీరంగం.. మట్టికరిచిన ముంబై

కలం, స్పోర్ట్స్ : వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరోసారి మట్టికరిచింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌ (CSK vs MI)లో వార్ వన్‌సైడ్ అయిపోయింది. తొలుత బ్యాటింగ్‌లో తామేంటో చూపించిన చెన్నై, బౌలింగ్‌లో కూడా తమమార్క్ చూపింది. ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ సంజూ శాంసన్ విజృంభిస్తే, బౌలింగ్ అకేల్ హోసేన్ విశ్వరూపం చూపాడు. ఏది ఏమైనా ముంబై ఇండియన్స్ 104 పరుగులకే ఆలౌట్ అయింది. పరుగుల వరద పారుతుందనుకున్న వాంఖడే పిచ్‌పై చెన్నై బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా కేవలం 104 పరుగులకే కుప్పకూలిన ముంబై, 103 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి సంజూ శామ్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో ముంబై బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21) ఫర్వాలేదనిపించడంతో చెన్నై 20 ఓవర్లలో 207 పరుగుల కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. ముంబై బౌలర్లలో గజన్ఫర్, అశ్వని కుమార్ రెండేసి వికెట్లు తీసినా పరుగులు భారీగా సమర్పించుకున్నారు.

ముంబై బౌలర్లలో AM గజన్ఫర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అశ్విని కుమార్ కూడా 2 వికెట్లు తీసినప్పటికీ 37 పరుగులు సమర్పించుకున్నాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకోగా, మిచెల్ సాంట్నర్ 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 2 ఓవర్లలోనే 19 ఎకానమీతో 38 పరుగులు ఇవ్వడం, క్రిష్ భగత్ 2 ఓవర్లలో 31 పరుగులు ఇవ్వడం ముంబై కొంపముంచింది.

208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే చుక్కలు కనిపించాయి. కేవలం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్పిన్నర్ అకీల్ హొసేన్ తన మాయాజాలంతో ముంబై వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. తిలక్ వర్మ (37), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు ప్రతిఘటించినా, మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

ముంబై ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. హార్దిక్ పాండ్యా (1), క్వింటన్ డికాక్ (7), రూథర్‌ఫోర్డ్ (0) ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. చివరకు 18.6 ఓవర్లలో 104 పరుగుల వద్ద ముంబై కథ ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>