Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగుల కన్నెర్ర.. దశలవారీ నిరసనలకు క్యాలెండర్ షెడ్యూల్ ఫిక్స్

కలం, తెలంగాణ బ్యూరో : నిన్నటిదాకా విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల తలనొప్పి. అది పరిష్కారమైందనుకునే సమయానికే ఆర్టీసీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మె. అది ఒక కొలిక్కి రాకముందే ప్రభుత్వ ఉద్యోగుల (Telangana Employees) జేఏసీ నిరసనలకు దిగేలా షెడ్యూలు రూపొందించింది. ప్రధాన కార్యదర్శికి నోటీసు సైతం ఇచ్చింది. మొత్తం 64 డిమాండ్లకు పరిష్కారం కోరుతున్న ఎంప్లాయీస్ జేఏసీ తక్షణం పరిష్కరించాల్సిన ఐదింటిని ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే ఒక రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో వచ్చే నెల 5న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చీఫ్ సెక్రటరీకి సమర్పించిన మెమొరాండంలో జేఏసీ తెలియజేసింది. ఒక రోజంతా నిరాహార దీక్షలు చేసినా పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణపై మే 14న జేఏసీ కార్యవర్గం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నది.

ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్లు ఇవే :

ప్రభుత్వ ఉద్యోగులు (Telangana Employees), ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలన్నీ ఇటీవల జేఏసీగా ఏర్పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఇటీవలే సమావేశమై నిరసనలు చేపట్టేందుకు క్యాలెండర్‌ను రూపొందించుకున్నాయి. అందులో భాగంగా నల్లబ్యాడ్జీల నిరసన పూర్తయింది. ఇక మే 5న ఒక రోజు నిరాహార దీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం ముందు

జేఏసీ పెట్టిన డిమాండ్లలో కీలకమైనవి కొన్ని :
  • రెండో పీఆర్సీ నివేదికను తెప్పించుకుని ఉద్యోగులకు 52% ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి.
  • పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
  • ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 13 వేల కోట్ల బిల్లులను, జీతాలను, పెన్షన్లను, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను, సరెండర్ లీవల్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను, జీపీఎఫ్‌ను వెంటనే చెల్లించాలి.
  • ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరన్స్ స్కీమ్‌పై స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి.
  • ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) పునరుద్ధరించాలి.

Read Also: టాప్ 20 హాటెస్ట్ సిటీల్లో 19 ఇండియాలోనే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>