కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్

కలం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం నలుగురిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ (Congress vs BRS vs BJP) అనే తీరులో పొలిటికల్ పైట్ వేడెక్కనున్నది. సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులోనే లేఖ రాసినా ఇప్పటివరకూ దర్యాప్తు మొదలు పెట్టకపోవడాన్ని ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు తప్పుపట్టారు. తాజాగా హైకోర్టు తీర్పులో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఆ నలుగురిపై ఎలాంటి చర్యలు వద్దనే స్పష్టత ఉండడంతో ఇప్పుడు రాష్ట్రం తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నది ఒక అంశమైతే, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాలన్నది రెండో అంశం.

క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత మరింత స్పష్టత :

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ గురువారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై లోతుగా చర్చ జరగనున్నది. హరీశ్‌రావు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న మతలబేంటో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితమే అనుమానాలను వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఇటు ప్రభుత్వానికీ, అటు బీఆర్ఎస్ లీడర్లకు చెంపపెట్టు లాంటిది కాకపోయినా నైతికంగా కేసీఆర్, హరీశ్‌రావులకు రిలీఫ్ రావడంతో ఆ మేరకు ప్రభుత్వం డీమోరల్ కావడానికి దోహదపడింది. ఈ తీర్పు అటు ఆ నలుగురినీ నిర్దోషులుగా ప్రకటించలేదు.. వారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఇటు కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వాన్నీ తప్పుపట్టలేదు. కమిషన్ ప్రొసీజరల్ ల్యాప్స్‌ను మాత్రమే హైకోర్టు తప్పుపట్టింది. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. క్యాబినెట్ సమావేశం తర్వాత స్పష్టత రానున్నది.

బీజేపీ నేతలే టార్గెట్‌గా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ :

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందంటూ నాలుగైదేళ్లుగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు కామెంట్ చేశారు. ఇప్పుడు వీటిని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తు తొందరగా మొదలయ్యేలా చొరవ తీసుకోవాలని వారిపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి పెంచేలా ఆలోచిస్తున్నారు. హైకోర్టు వెలువరించిన తీర్పు సీబీఐ దర్యాప్తుకు అడ్డు కాదని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఎలాగూ సీబీఐ చేతిలో విజలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులు సైతం ఉన్నాయి. వీటి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టడానికి ఎలాంటి ఆటంకాలూ లేవు. సరిగ్గా వీటినే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తేనున్నది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై ఒత్తిడి పెంచనున్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారిని చట్టపరంగా శిక్షించాలని, దోషులెవరో తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు కోసం ప్రయత్నించాలని ప్రెషర్ చేసే అవకాశమున్నది.

రాష్ట్రం నుంచి వివరాలు సేకరించిన సీబీఐ :

ఇప్పటికే సీబీఐ దగ్గర విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు కూడా ఉన్నది. వాటిని అధ్యయనం చేసిన తర్వాత తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ ఇటీవల లేఖ రాసింది. దానికి తగినట్లుగా పోలీసు శాఖ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇరిగేషన్ డిపార్టుమెంటు నుంచి ఒక అధికారి వెళ్ళి పూర్తి వివరాలను అందజేశారు. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే దర్యాప్తు కోసం ప్రాథమిక స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఏ ఏజెన్సీ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ప్రారంభం కాకముందే సీబీఐ అధికారులు చేపట్టబోయే దర్యాప్తుపై స్పష్టత ఇస్తారా?.. బీజేపీ ఎంపీలు తామే చొరవ తీసుకున్నామనే క్రెడిట్ తీసుకుంటారా?.. ఇవన్నీ త్వరలో తేలనున్నాయి.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>