కలం, వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికల (Panchayat Elections) పోలీంగ్ సమీపిస్తుండటంతో సర్పంచ్ అభ్యర్థులు దూకుడు పెంచుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ‘అమ్మా మాకే ఓటేయండి’ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సర్పంచ్ సాబ్ అనిపించుకునేందుకు తమ అంగ బలం, అర్థ బలం ప్రదర్శిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు భారీగా డబ్బులు సమర్పించుకుంటుండగా.. మరికొందరు మద్యం బాటిళ్లను పంచుతున్నారు. ఇప్పటికే చాలా చోట్లా ఏకగ్రీవాల పేరుతో లక్షలు కుమ్మరిస్తూ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అభ్యర్థి క్షుద్రపూజలు కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ అభ్యర్థి నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేయడం సంచలనం రేపింది. ఓ మాంత్రికుడితో తాంత్రిక పూజలు చేస్తూ బయటకొచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల్లో గెలవడం కోసం క్షుద్ర పూజలు చేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో జ్యోతిష్యుడి సలహాతో ఓ అభ్యర్థి తన భార్యను కూడా పోటీలో నిలిపాడు. కొన్ని చోట్లా సర్పంచ్ పీఠం కోసం భార్యభర్తలు, తల్లీ కూతుళ్లు, అన్నదమ్ములు పోటీ అనుబంధాలను మరిచి రచ్చకెక్కుతున్నారు. ఇలాంటి భిన్న ఘటనలు స్థానిక ఎన్నికలపై ఉత్కంఠను పెంచుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల (Panchayat Elections) ప్రచారంతో గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. బెల్ట్ షాపులు, అక్రమ మద్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి సర్పంచ్ అభ్యర్థులే రహస్యంగా మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు పంచుతున్నారు. కేసులను తప్పించుకోవడానికి స్థానిక పోలీసులకు నెలవారీ లంచాలు చెల్లిస్తారని ఆరోపణలున్నాయి. పోలీంగ్ సమయానికి మరిన్ని బెల్టు దుకాణాలు తెరుచుకునే అవకాశాలున్నాయి.
Read Also: చుక్కేసి చిక్కారు.. ఒక్కరోజే 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Follow Us On: Pinterest


