కలం, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవ్ (Mahadev) ఆత్మహత్యకు నిరసనగా ఆ పార్టీ (BJP Protest) కార్యకర్తలు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుల వేధింపుల వల్లే మహదేవ్ ప్రాణాలు తీసుకున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నిరసన సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో డీసీపీ శిల్పవల్లి కింద పడిపోయినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో పోలీసులు భారీగా మోహరించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
లోక్ సభలో ప్రస్తావన..
మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లోక్‌సభలో లేవనెత్తారు. ముఖ్యమంత్రి సొంత గడ్డపైనే కాంగ్రెస్ రాక్షసకాండ జరిగిందన్నారు. అధికార మదంతో గిరిజన అభ్యర్థి ఎరుకల మహదేవ్‌ను బలితీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సాగిస్తున్న ఈ రక్తచరిత్రను, అరాచకాలను యావత్ దేశం ఖండించాలని పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్ చేసిన హత్య..
కాంగ్రెస్ నాయకుల బెదిరింపులతోనే బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోవాలని మహదేవ్ పై ఒత్తిడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా తాము భావిస్తున్నామని సంజయ్ తెలిపారు.
పరామర్శించిన డీకే అరుణ..
మక్తల్ (Makhtal) ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మహదేవ్ భౌతిక కాయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను డీకే అరుణ పరామర్శించారు.
స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి..
బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) స్పందించారు. మహాదేవప్ప మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ, మహాదేవప్ప మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. తన ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు. ఈ విషాదకర ఘటనను రాజకీయం చేయవద్దని ఆయన పేర్కొన్నారు.
Read Also: ఎంపీలే పొరపాటు చేస్తే… పార్లమెంటులో జరిగిందిదే..
Follow Us On: Sharechat


