కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో దేశ భద్రతకు ముప్పు ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ మాట్లాడటానికి దేశ వ్యతిరేక శక్తులే ఉన్నాయా అని ఘాటుగా ప్రశ్నించారు. భారతదేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపటానికి మాత్రమే ఆయన లండన్ పర్యటనకు వెళ్లారని ఆరోపణలు చేశారు. రేవంత్ విధానం మోదీకి వ్యతిరేకం, భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకం అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో చిచ్చు రగిలించి రాజకీయ లబ్ధి పొందడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని మండిపడ్డారు. సీఎం తమ్ముడే తనను పోలీసులతో ఫాలో చేయిస్తున్నారని అంటూ చెప్పుకొచ్చారు. ’తనను ఎం చేస్తారో చేసుకోండి‘ అరవింద్ బహిరంగ సవాల్ విసిరారు. డీజీపీ సీవీ ఆనంద్ మంచి అధికారి, ఇలాంటి పనులను ప్రోత్సహించవద్దు అని సూచించారు. ‘చదువురాని విద్యాశాఖ మంత్రి రేవంత్’ అంటూ ఎంపీ అరవింద్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

