కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే కూతురు మహిళా పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని (Karnataka) మాండ్య జిల్లా శ్రీరంగపట్నం ఓ అమ్మవారి ఆలయంలో జరిగింది. అమావాస్య సందర్భంగా ప్రత్యేక దర్శనం విషయంలో తలెత్తిన వాగ్వాదం వివాదానికి దారితీసింది. తుముకూరు గ్రామీణ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేశ్ గౌడ కూతురు ఐశ్వర్య, ఆలయ విధుల్లో ఉన్న మహిళా పోలీస్ సవితా బి. పాటిల్‌ను క్యూ లైన్ నిబంధనల విషయమై ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఎమ్మెల్యే కూతురు చెంపదెబ్బ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు ఐశ్వర్యపై ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దుమారం చెలరేగడంతో ఎమ్మెల్యే సురేశ్ గౌడ స్పందించారు. తన కూతురు ప్రవర్తనకు బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఆలయాల్లో వీఐపీ ప్రోటోకాల్ కల్చర్‌ను రద్దు చేయాలని జనాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

