కలం, రాజన్న సిరిసిల్ల: భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ (Upper Manair Project) పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. పాల్వంచ, కూడవెళ్లి వాగులు పోటెత్తుతుండటంతో జలాశయానికి భారీగా వరద చేరుకుంటోంది. దిగువకు వెళ్తున్న నీటితో లింగన్నపేట–గంభీరావుపేట మధ్య ఉన్న తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డు తెగిపోవడంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
భారీగా తరలివస్తున్న పర్యాటకులు..
ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 2.20 టీఎంసీలు కాగా, పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 2,220 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రధానమైన కుడి కెనాల్‌కు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్ వే నుంచి 2,120 క్యూసెక్కుల నీటిని కిందకు వెళుతోంది. గడిచిన 20 రోజుల వ్యవధిలోనే జలాశయం రెండోసారి అలుగు పారుతుండటంతో స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండలా మారిన జలాశయం, మత్తడి దూకుతూ తెల్లటి జలపాతంలా ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి రాజన్న సిరిసిల్లతో పాటు సమీప జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్థానిక పోలీసులు డ్యాం పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, సందర్శకులు అలుగు పారే నీటి వద్దకు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టారు. నిజాం కాలంలో 1943 – 1950 మధ్య మానేరు నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్.. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని వేలాది ఎకరాలకు ప్రధాన సాగునీటి వనరుగా సేవలందిస్తోంది.

